చిన్న పత్రికలను ఆదుకోవాలి…?

తెలంగాణ రాష్ట్రం వ‌చ్చిన త‌ర్వాత ప్రాంతీయ‌ ప‌త్రిక‌లు న‌డిపే వారి జీవితాలు బాగుప‌డతాయ‌ని ఆశించాం. ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డింది కానీ…. ప్రాంతీయ ప‌త్రిక‌లు నిర్వ‌హిస్తున్న వారి జీవితాలు మాత్రం ఆగ‌మ్య‌గోచ‌రంగా త‌యారయ్యాయి. ఎంపానెల్ అయిన ప్రాంతీయ పత్రికలకు రెండున్న‌ర సంవ‌త్స‌రాల నుంచి అటెండెన్స్ నిర్వ‌హిస్తూ…. వ‌స్తోంది తెలంగాణ సమాచార శాఖ. ప‌త్రిక‌లు నిర్వ‌హిస్తున్న వారు రెగ్యుల‌ర్‌గా అడెండెన్స్ నిబంధ‌న‌లు తూచా త‌ప్ప‌కుండ పాటిస్తున్నారు. అయితే ఒరిగింది మాత్రం ఏమీ లేదు. యజ‌మానుల జీవితాలు క‌రిగిపోవ‌డం త‌ప్ప‌….. ప్ర‌భుత్వం చేసింది మాత్రం శూన్య‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. అటెండెన్స్ వేయించుకుంటూ ప్రకటనలు ఇచ్చే ప్రక్రియను నిలిపివేయడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉమ్మ‌డి రాష్ట్రంలో కంటే దారుణంగా ప్రస్తుతం పరిస్తితులున్నాయి.

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ప్ర‌తి పోరాటంలో ప్రాంతీయ ప‌త్రిక‌ల భాగ‌స్వామ్యం ఉంద‌న్న‌ది న‌గ్న‌స‌త్యం. అప్పడు ఎన్నో క‌ల్లబొల్లి మాట‌లు చెప్పిన సీఎం కేసీఆర్‌…. ఇప్పుడు మా జీవితాల‌ను అంధ‌కార‌మ‌యం చేశారు. ఎంపానెల్ అయిన ప‌త్రిక‌ల‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌కుండా వేధింపుల‌కు గురిచేస్తోంది. కనీసం క్లాసిఫైడ్‌, డిస్‌‌‌ప్లే యాడ్లు కూడా ఇవ్వ‌లేదు. ఏండ్లు గ‌డిచిపోతున్నాయి త‌ప్ప‌…. మా జీవితాలు మాత్రం బాగుప‌డ‌డం లేదు. ముఖ్యంగా ఐ అండ్ పి ఆర్ కార్యాల‌యంలో కొన్ని సంవ‌త్స‌రాలుగా పాతుకుపోయి ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తున్న కొంద‌రు అధికారుల తీరు మ‌రీ దారుణంగా ఉంది. వారు త‌మ‌కు తోచిన ప‌త్రిక‌లకు మాత్ర‌మే మేలు చేస్తున్నారు. సహకారాన్ని అందిస్తున్నారు. ఇక మిగ‌తా యాజ‌మాన్యాల‌ను పురుగుల‌కంటే హీనంగా చూస్తున్నారు. ఐ అండ్ పిఆర్ వారు పెట్టిన అన్ని నిబంధ‌న‌లు పాటిస్తూ…. ముందుకు వ‌స్తున్న వారికీ అధికారులు తీర‌ని అన్యాయం చేస్తున్నారు. త‌మ‌కు అమ్యామ్యాలు ఇచ్చే వారిని మాత్ర‌మే అధికారులు ప్రొత్స‌హిస్తున్నారు. త‌మ‌కు న్యాయం చేయ‌మ‌ని మా యూనియ‌న్ త‌రపున ఎన్నో సార్లు వినతి చేశాం. చిర‌వ‌కు ధ‌ర్నాలు చేశాం… అయిన క‌రుడుక‌ట్టిన‌…. అవినీతి అధికారులు తీరు మాత్రం మార‌లేదు. ఇక సీఎం కేసీఆర్ మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకోలేద‌న్నది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఇప్ప‌టి వ‌ర‌కు మేము వారిని భుజాల‌పై మోశాం.. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు విస్తృతంగా వార్తల రూపంలో ప్రచారం చేశాం. హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఇక విర‌మించుకుంటున్నాం.

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో జ‌రుగుతున్న ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తెరాస పార్టీకి వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌ని తీర్మానించుకున్నాం. హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తున్నఏదో ఒక ప్రతిపక్ష పార్టీ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నాం. మా నిర‌స‌న కొనసాగింపులో భాగంగా నాగార్జున‌సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌ల్లో…. 200 మందికి పైగా ప్రాంతీయ పత్రిక‌ల ఎడిట‌ర్లు…. విలేకరులు పోటీ చేయ‌నున్నాం. అంతేకాకుండా ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా వివ‌క్ష ధోర‌ణిని విడ‌నాడాలి. అవినీతి అధికారుల‌ను తొల‌గించాలి. మా న్యాయ‌మైన డిమాండ్ల‌ను నెర‌వేర్చాలి. ప్ర‌క‌ట‌న‌లు క్ర‌మం త‌ప్ప‌కుండా ఇవ్వాలి. ఇటీవ‌ల ఎంపానెల్‌మెంట్ అయిన పత్రిక‌ల ఎడిట‌ర్ల‌కు అక్రిడిటేష‌న్ కార్డులు ఇవ్వాలి. ప్ర‌భుత్వం స్పందించ‌ని ప‌క్షంలో పెద్ద ఎత్తున ఉద్య‌మాల‌ను చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి బంగారు తెలంగాణాలో జర్నలిస్టుల బతుకులు ఎలా ఉన్నాయో ప్రజలకు తెలియజేస్తాం.

యూసుఫ్ బాబు. అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర చిన్న, మధ్యతరహా దినపత్రికలు మరియు మ్యాగజైన్స్ అసోసియేషన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *