నిమ్స్‌కు ‘చికిత్స’ చేయండి సారూ..!

నిమ్స్‌కు ‘చికిత్స’ చేయండి సారూ..!

  • వసతులు కరువు, వైద్యం బరువు.
  • మసకబారుతున్న నిమ్స్‌ ప్రతిష్ట.
  • పేదలకు దూరమవుతున్న నాణ్యమైన వైద్యం.
  • ఇంకా తొలగని గత ప్రభుత్వ ముద్రలు.
  • అడ్గగోలు నిర్ణయాలతో ఆర్థిక సమస్యలు.
  • దూరమవుతున్న నిపుణులైన వైద్యులు.
  • డైరెక్టర్‌ ఒంటెద్దు పోకడతో అస‍్తవ్యస్తంగా పాలనా వ్యవస్థ.
  • సీఎం రేవంత్‌ దృష్టిసారిస్తేనే మార్పు సాధ్యం.

నిజామాబాద్‌ జిల్లాలోని ఓ పల్లెటూరుకు చెందిన శ్రీకాంత్‌ రోడ్డు యాక్సిడెంట్‌కు గురై , కాలుకు ఫ్రాక్చరైంది. పేదవాడైన శ్రీకాంత్‌ పెద్ద వైద్యం చేయించుకోలేక స్థానిక వైద్యుడిని సాయం కోరగా,ఆయన ఏమాత్రం తడుముకోకుంఆ హైదరాబాద్‌లోని నిమ్స్‌కు వెళ్లండి అక్కడ మీకు మంచి ఆర్థోపెడిక్‌ వైద్య సేవలందుతాయని చెప్పగా,శ్రీకాంత్‌ తల్లిదండ్రులు అదే పనిచేశారు. అక్కడి వైద్యంతో కోలుకుని మామూలు మనిషయ్యాడు.

ఒడిశాలోని ఓ గ్రామానికి చెందిన మాణిక్‌ పట్నాయక్‌కూ పాప పుట్టింది. రెండేళ్లకు ఆ పాపకు గుండె సంబంధిత వ్యాధి సోకింది. కానీ చికిత్సకు డబ్బులు లేవు. దీంతో నిమ్స్‌కు వచ్చి ఇక్కడ అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు పొందాడు.

ఇవి నగరంలోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌) గొప్పతనం గురించి చెప్పేందుకు చిన్న ఉదాహరణలు. అయితే ఈ గొప్పతనమంతా గతమే అని చెప్పొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలు..దేశాల నుంచి సైతం నిమ్స్‌కు వచ్చి ఒకప్పుడు వైద్య సేవలు పొందుతుండేవారు. అయితే రాను రాను నిమ్స్‌ ప్రతిష్ట మసకబారింది. పేదలకు కార్పొరేట్‌ స్థాయిలో వైద్యం అందించాలన్న సదుద్దేశ్యంతో ఏర్పాటైన నిమ్స్‌లో ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. నాణ్యమైన వైద్య సేవలు మృగ్యమయ్యాయి. నిమ్స్‌కు వెళ్లాలంటే జనానికి విరక్తి వచ్చేలా పరిస్థితులు దిగజారాయి. సేవాభావం కలిగిన ఎందరో గొప్పగొప్ప వైద్యులు పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నిమ్స్‌లో చేరడంతో ఇక్కడ కార్పొరేట్‌ స్థాయి వైద్య సేవలు చాలా తక్కువ ఖర్చుతోనే అందేవి. కానీ నిమ్స్‌పై ప్రభుత్వాలు శ్రద్ధ చూపకపోవడం..సరైన నిధులు కేటాయించకపోవడం..పాలకమండలి అవినీతి, నిర్లక్ష్యం కారణంగా పేదలు నాణ్యమైన సేవలకు దూరమవుతున్నారు. అలాగే ఇక్కడి దిగజారిన పరిస్థితులు..అవమానాలు తట్టుకోలేక అతికీలకమైన ఆర్థోపెడికి, న్యూరో, కార్డియాలజీ, కేన్సర్‌ సంబంధిత విభాగాలకు చెందిన అత్యంత నిపుణులైన వైద్యులు నిమ్స్‌ను వీడారు.


ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్థానంలో కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన నేపథ్యంలో నిమ్స్‌ పరిస్థితుల్లో మార్పు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వైద్య వర్గాలంటున్నాయి. ముఖ్యంగా వైద్యవ‍్యవస్థను ప్రక్షాళన చేస్తామని, పేదలకు మెరుగైన ప్రభుత్వ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని నూతన సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల తరుచుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రతిష్టాత్మక నిమ్స్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా :

నిమ్స్‌కు ఏడాది క్రితం నియమతులైన డైరెక్టర్‌…అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆశీస్సులతో పదవి పొందారు. కానీ ఆయన పదవిలోకి వచ్చాక పరిస్థితిలు దిగజారాయనే చెప్పొచ్చు. ఇక నిమ్స్‌లో అడ్డగోలు చెల్లింపుల ద్వారా కోట్లాది రూపాయలు వృథా అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. నిమ్స్‌ ఫైనాన్స్‌ కమిటీ, నిమ్స్‌ పాలక మండలి బోర్డు అనుమతి లేకుండానే తనకు నచ్చిన ఫ్యాకల్టీలకు అలవెన్సులు, ఇతర సదుపాయాల పేరిట రూ.10 నుంచి 15 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న నిమ్స్‌ ఆర్థిక పరిస్థితి ఈ కారణంగా మరింత కుదేలైంది. అలాగే నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు ప్రమోషన్లతో తన వర్గానికి డైరెక్టెర్‌ పెద్ద పీట వేస్తున్నారని తెలుస్తోంది. అర్హతలు లేని వైద్యులను సైతం అందలం ఎక్కించినట్లు తెలిసింది. అలాగే ఎక్స్‌పర్ట్‌ కమిటీ పేరుతో పదవీ విరమణ చేసిన వారిని, బయట వారిని అత్యధికంగా నియమిస్తున్నారని, దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని తెలిసింది. 73 ఏళ్ల వయసున్న ఓ వైద్యుడు రిటైర్‌ అయ్యాక కూడా ఇక్కడే 15 ఏళ్లుగా పనిచేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సుదీర్ఘ కాలంగా ఇక్కడే పాతుకుపోయిన ఈ సీనియర్‌ వైద్యుడు అన్నీ తప్పుడు సలహాలతో వ్యవస్థను ఆగం చేస్తున్నారని వైద‍్యవర్గాలు అంటున్నాయి.

మాజీ మంత్రి ఆదేశాలు పాటిస్తున్నారా..?:

ఇక మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే…బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో వైద్యశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆదేశాలను ఇప్పటికీ నిమ్స్‌ డైరెక్టర్‌, ఎగ్జిక్యూటివ్‌ రిజిస్ట్రార్‌లు పాటిస్తున్నారని ఆరోపణలు విన్పిసు‍్తన్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా..సదరు డైరెక్టర్‌ మాత్రం మాజీ మంత్రి ఆదేశాలను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిమ్స్‌లో కొత్త నియామకాలు, పదోన్నతులు, మెటీరియల్‌ కొనుగోళ్ల విషయంలో భారీగా అవినీతి చోటుచేసుకుంటోందని, కోట్లాది రూపాయలు వృథా అవుతున్నాయని ఆరోపణలు విన్పిస్తున్నాయి.

వైద్యులు…పరికరాల కొరత :

ఇక నిమ్స్‌లో ప్రస్తుతం అన్ని విభాగాల్లోనూ అనుభవజ్ఞులైన వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. ఆర్థోపెడిక్‌, న్యూరో, కార్డియాలజీ, జనరల్‌ మెడిసిన్‌ వంటి కీలక విభాగాల్లోని సీనియర్‌ వైద్యులు ఇక్కడి పరిస్థితులు నచ్చక నిమ్స్‌ను వీడారు. వీరికి బయట లక్షల రూపాయల జీతాలు వచ్చే అవకాశం ఉన్నా…నిమ్స్‌లో పేదలకు సేవలందించాలని ఇక్కడికి వచ్చారు. కానీ వారికి నిమ్స్‌ అధికారిక వ్యవస్థ నుంచి ఎలాంటి సహకారం అందకపోగా..అవమానాల పాలవుతున్నారు. వీరికి చాంబర్లు, కుర్చీలు, ఫ్యాన్లు వంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కారణంగానే చాలా మంది నిమ్స్‌ను వీడి కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చేరారని తెలుస్తోంది.

By ఎన్.మల్లేష్ ( వార్త ).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *