దానంకు ‘చెయ్యి’స్తారా?

దానంకు ‘చెయ్యి’స్తారా?

  • నమ్ముకున్న వాల్లే “విజయా”నికి అడ్డా?
  • “మన్నే ” నే రాజి నేడు అసంతృప్తా?
  • అయన రాజకీయ’ వనం “లో “మహి”మలు ఎన్నో!

– దానం మేల్కోకుంటే ఓటమి తప్పదేమోనని పరిశీలకుల వ్యాఖ్య

దానం నాగేందర్‌…ఈయన పేరు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగారు. మంత్రి పదవులూ చేపట్టారు. మారిన పరిస్థితుల కారణంగా ఇప్పుడు బీఆర్‌ఎస్‌లో ఉన్నారు. ఈయన నగరంలోనే కీలకమైన ఖైరతాబాద్‌ సెగ్మెంట్‌ నుంచి ఈసారీ బీఆర్‌ఎస్‌ తరపున బరిలో నిలిచారు. సాధారణంగా దానం నాగేందర్‌కు బలమైన నేతగా పేరుంది. పీజేఆర్‌ శకం ముగిశాక దానం విజయం సులువుగానే సాగుతుంది. అయితే…ఈసారి మాత్రం దానం విజయం అంత ఈజీ కాదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అనూహ్యంగా పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలో నిలవడంతో దానంకు బలమైన పోటీనే ఉంటుందని అంటున్నారు. దానం నమ్ముకున్న ‘వనం’లో గంజాయి మొక్కలు మొలిచినట్టు తెలుస్తుంది. ఓ నేతతో ‘మన్నె’నే రాజీ కుదిర్చినా ఫలితం దక్కేలా లేదంటున్నారు. ఇక మరో ఇద్దరు మాజీ కార్పొరేటర్లు ఆయనపై గుర్రుగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మాజీల్లో ఒకరు తన ‘మహి’మతో సాధ్యమైనంత వరకు దానంను ఓడించే పనిలో ఉన్నట్టు తెలిసింది. ఆయన బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పటికీ దానంపై గుర్రుగానే ఉన్నట్టు సమాచారం. మరో మాజీతో కలసి తన తన సామాజిక వర్గం ఓట్లు దానంకి వ్యతిరేకంగా పడేలా తన ‘మహి’మ చూపిస్తున్నట్టు తెలుస్తుంది, ఇక దానం ఎన్నికల సమయంలో కూడా తమను పట్టించుకోవడం లేదు అని మరి కొందరు అసంతృప్తితో ఉన్నారు.

సొంత పార్టీ నేతల నుంచే సమస్యలు :

ఇప్పటి వరకు దానం వెంటే నడిచిన కొందరు నేతలు సరిగ్గా ఎన్నికల సమయంలో ఏకంగా ఆయన్నే ఓడించాలని కుతంత్రాలకు సిద్ధం అవ్వడంతో దానం ఓటమి సొంత పార్టీ నేతల చేతుల మీదుగానే జరిగేలా ఉందని అంటున్నారు. గతంలో దానం నాగేందర్‌కు ప్రియశిష్యులుగా పనిచేసిన ఇద్దరు మాజీ కార్పొరేటర్లు ఇప్పుడు తమ రూటు మార్చినట్లు తెలుస్తోంది. సొంత పార్టీలో ఉంటూనే దానంకు కాకుండా ఈసారి కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని వ్యూహరచన చేస్తున్నట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి. ఈ మేరకు ఆ పార్టీ అభ్యర్థిని విజయారెడ్డికి ఓట్లు వేయాలంటూ తమ అనుచర నేతలు, కార్యకర్తలకు స్వయంగా చెప్పడంతోపాటు ప్రజలకు కూడా ఇదే విషయం తెలియజేయాలని ప్రోత్సహిస్తున్నారనే టాక్ నడుస్తోంది.

రహస్య మంతనాలు..వ్యతిరేకంగా పావులు :

ఇక ఇదే నియోజకవర్గానికి చెందిన మరో ఇద్దరు ముఖ్య నాయకులు ఇప్పటికే రహస్య సమావేశాలు నిర్వహిస్తూ దానంకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఒకరైతే ఏకంగా బాహాటంగానే దానం చర్యలను విమర్శిస్తూ ఖైరతాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని.. అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ప్రచారం చేస్తున్నారు. నిన్నటి వరకు దానం పాట పాడిన వీరు వ్యూహాత్మకంగా ఎన్నికల సమయంలో తనకు వ్యతిరేకంగా పనిచేస్తుండడంతో దానం వర్గీయులు ఆందోళన చెందుతున్నారు.

స్వయంగా కేసీఆర్‌, కేటీఆర్‌ ఆరా :

అసలే సమయం చాలా తక్కువగా ఉంది. వ్యవహారం ఏమాత్రం బెడిసి కొట్టినా పార్టీ అధిష్టానం దానంపై సీరియస్ అవడం గ్యారెంటీ. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా పేరు ఉన్న నియోజకవర్గాల్లో ఖైరతాబాద్ ఒకటి. స్వయంగా కేసీఆర్‌, కేటీఆర్‌లు ఈ నియోజకవర్గ పరిస్థితులను రాజకీయ సమీకరణాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని వినికిడి. నగరానికే ఆయువు పట్టుగా ఉన్న ఖైరతాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు ఓటమి ఎదురైతే ఖచ్చితంగా పార్టీకి పెద్ద దెబ్బ పడుతుందని..ఇప్పటికైనా తిన్నింటివాసాలు లెక్కపెట్టే నాయకులను గుర్తించి సెట్ చేయకుంటే ఊహించినట్టే దానం ఓటమి అంచును నిలబడాల్సి వస్తుందని పరిశీలకులు అంటున్నారు.

తెర వెనుక చక్రం తిప్పుతన్న కార్పొరేటర్ భర్త :

దానం నాగేందర్‌ బాగా నమ్మిన..సొంత పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్ భర్త కూడా ఆసారి ఆయనకు ‘చేయి’ ఇచ్చేలా ఉన్నారని తెలుస్తోంది. అధిష్టానం ఒక సీనియర్ బీఆర్‌ఎస్‌ నేతని ఒప్పించి దానంతో రాజీ కుదిర్చినప్పటికీ ఆయన దానం‍కు మద్దతివ్వడం..అనుకూలంగా పనిచేయడం సందేహమేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

పీజేఆర్‌ ఓటు బ్యాంకు మరో దెబ్బే :

ఇక ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో దివంగత నేత పి.జనార‍్ధన్‌రెడ్డికి ఇప్పటికీ కొంత ఓటు బ్యాంకు ఉందనే నానుడి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆయన కుమార్తె విజయారెడ్డి కాంగ్రెస్‌ నుంచి బరిలో నిలవడం కూడా దానం నాగేందర్‌కు ఈసారి దెబ్బేనని అంటున్నారు. ఇది దానం గెలుపోటములపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. విజయారెడ్డి కూడా తనదైన శైలిలో గుట్టచప్పుడు కాకుండా తన తండ్రి పేరు..ఆయన చేసిన పనులను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేపట్టారు. ముఖ్యంగా బస్తీలు, కాలనీల్లో ఓట్లు సాధించడం ఈసారి దానంకు కష్టమే అని అంటున్నారు.

By ఎన్.మల్లేష్ ( వార్త ).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *